Nara Lokesh: ప్రైవేట్ కాలేజీ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎందుకు రద్దు చేశారు?: లోకేశ్
- మీ పిల్లలకు మాత్రమే ఫారెన్ చదువులా?
- బడుగు, బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా?
- ఎన్నికల ముందు కూతలు అధికారం వచ్చాకా కోతలు
ప్రైవేటు కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను నిలిపివేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసేసి పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఏపీ ప్రభుత్వం ఆడుకుంటోందని చెప్పారు.
‘మీ పిల్లలకు మాత్రమే ఫారెన్ చదువులా? బడుగు, బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా వైఎస్ జగన్ గారు? ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఎన్నికల ముందు కూతలు అధికారం వచ్చాకా కోతలు’ అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
‘ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసింది వైకాపా ప్రభుత్వం. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం మంచిది కాదు జగన్ రెడ్డి గారు’ అని లోకేశ్ అన్నారు.
‘ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీఓని వెనక్కి తీసుకోవాలి. ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చెయ్యాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.