Narendra Modi: కొత్త ఏడాది భారత్ లక్ష్యాలను ‘మన్ కీ బాత్’లో చెప్పిన ప్రధాని మోదీ
- కొత్త ఏడాది భారత్ సరికొత్త శిఖరాలను అధిరోహించాలి
- భారత్ మరిన్ని సామర్థ్యాలు పెంపొందించుకుంది
- ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్కు 2021లో స్వస్తి
- కశ్మీర్ కుంకుమ పువ్వు ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ బ్రాండ్ కావాలి
ఈ ఏడాది తన చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. కొత్త ఏడాది భారత్ సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని చెప్పారు.
ఈ ఏడాది కరోనా సంక్షోభ పరిస్థితులు మనకు కొత్త పాఠాలను నేర్పాయని అన్నారు. పరిశోధకులు కూడా అంచనా వేయలేని పరిస్థితులు వచ్చాయని చెప్పారు. భారత్ మరిన్ని సామర్థ్యాలు పెంపొందించుకుందని తెలిపారు. ఈ ఏడాది దేశ ప్రజల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు.
ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్కు 2021లో స్వస్తి చెప్పాలనే లక్ష్యం ఉందని తెలిపారు. గురుగ్రాం నుంచి కర్ణాటక వరకు స్వచ్ఛమైన వాతావరణంపై శ్రద్ధ పెరిగిందని చెప్పారు. వారి ప్రయత్నాలు చాలా స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. కశ్మీర్ కుంకుమ పువ్వు ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ బ్రాండ్ కావాలని ఆయన ఆకాంక్షించారు. దేశ ఉత్పత్తులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తయారు చేసి, ఎగుమతులను పెంచుకోవాలని చెప్పారు.
భారత్లో తయారీ దారులు నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిని అందించాలని కోరారు. ఢిల్లీలోని ఝందేవాలా మార్కెట్లో గతంలో విదేశీ ఆటవస్తువులే ఎక్కువగా ఉండేవని ఆయన చెప్పారు. ఇప్పుడు మాత్రం కేవలం దేశీయంగా తయారైన ఆటబొమ్మలే అమ్ముతున్నారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ప్రజలు స్థానిక వస్తువులకే ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. సాహిబ్జాదే, మాతా గుజ్రీ, గురు తేగ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ వంటి వారి త్యాగాలకు దేశ ప్రజలు రుణపడి ఉన్నారని ఆయన చెప్పారు. మనం వాడుతున్న వస్తువుల్లో విదేశాల్లో తయారవుతున్న వస్తువులేవో గుర్తించాలని చెప్పారు. వాటికి దేశీయంగా ప్రత్యామ్నాయాలేంటో కనిపెట్టాలని చెప్పారు.
భారత్లో చిరుతపులులు 2014-2018 మధ్య 60 శాతం వరకు పెరిగినట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారత్లో పులులు, సింహాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని, అడవుల విస్తీర్ణం కూడా పెరిగిందని తెలిపారు. నాలుగేళ్లలో కొత్త ఏడాది ప్రారంభమవుతుందని, ఇది ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ అని మోదీ గుర్తు చేశారు.