Raja Singh: శ్రీశైలం నాకు మూడు గంటలే... ఎప్పుడు రావాలో తెలుసు: శిల్పా సవాల్ పై స్పందించిన రాజాసింగ్
- శిల్పా చక్రపాణి, రాజాసింగ్ మధ్య మాటలయుద్ధం
- శ్రీశైలం దేవస్థానం నేపథ్యంలో శిల్పా సవాల్
- తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని వెల్లడి
- శ్రీశైలంలో అన్యమతస్తుల అంశంపై ఫొటోలు విడుదల చేసిన రాజాసింగ్
శ్రీశైలం దేవస్థానం నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీశైలం క్షేత్రం వద్ద దుకాణాల కేటాయింపులో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, రజాక్ అనే వ్యక్తి సాయంతో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ శిల్పా చక్రపాణిరెడ్డిపై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి శిల్పా బదులిస్తూ, తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమేనా అంటూ రాజాసింగ్ కు సవాల్ విసిరారు. ఈ సవాల్ పై రాజాసింగ్ స్పందించారు.
తాను మూడు గంటల్లో శ్రీశైలం చేరుకోగలనని, ఎప్పుడు రావాలో తనకు తెలుసని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో అన్యమతస్తులకు కేటాయించిన దుకాణాల జాబితాను వెల్లడించారు. అంతేకాదు, ఆలయ ప్రాంగణం, ఈవో కార్యాలయంలో అన్యమతస్తులు సంచరిస్తున్న ఫొటోలను కూడా విడుదల చేశారు. ఎవరి అండతో శ్రీశైలం ఆలయంలో రజాక్ రెచ్చిపోతున్నాడో శిల్పా చక్రపాణిరెడ్డి సమాధానం చెప్పాలని రాజాసింగ్ నిలదీశారు.
అక్రమాలపై ప్రశ్నిస్తే నోరు కోసేస్తామని శిల్పా అంటున్నారని, తాము తలుచుకుంటే దేశం మొత్తం శ్రీశైలానికి తరలివస్తుందని హెచ్చరించారు. శిల్పా చక్రపాణిరెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరవాలని, రజాక్ భార్య గోశాల ఇన్చార్జిగా ఉన్నప్పుడు 300 ఆవులు మరణించాయని రాజాసింగ్ వెల్లడించారు.