JC Prabhakar Reddy: ఆరు టైర్లు ఉంటే చాలు.. డ్రైవర్ గానో, క్లీనర్ గానో ఎక్కడైనా బతగ్గలను: జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు
- తాడిపత్రి ఘటనపై మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి
- తాను కేసులు పెట్టబోనని స్పష్టీకరణ
- కేసులు పెడితే పోలీసులు సస్పెండవుతారని వెల్లడి
- నాకేం వస్తుంది అంటూ జేసీ వ్యాఖ్యలు
- సజ్జల తనను చంపించాలని చూస్తున్నారని ఆరోపణ
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల తాడిపత్రిలో జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నివాసం వద్ద జరిగిన సంఘటనలపై తాను ఫిర్యాదు చేస్తే బలయ్యేది పోలీసులేనని అన్నారు. వీడియో ఫుటేజి చూస్తే పోలీసులు విధి నిర్వహణలో ఏంచేశారన్నది వెల్లడవుతుందని, అందుకే తాను ఫిర్యాదు చేయడంలేదని తెలిపారు. ఒకవేళ తాను ఫిర్యాదు చేస్తే 9 మంది కానిస్టేబుళ్లు, ఒక ఎస్సై సస్పెండ్ అవుతారని జేసీ వెల్లడించారు. తనకు పోలీసులంటే అమితమైన గౌరవం ఉందని స్పష్టం చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి తనను ఎలాగైనా చంపించాలని చూస్తున్నాడని ఆరోపించారు. తాను ప్రజల మనిషనని, ప్రజల్లోనే ఉంటానని, చాతనైతే చంపుకోండి అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తన తుపాకీ లైసెన్స్ ను ఇంతవరకు రెన్యువల్ చేయడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
"చాలామంది కేసు పెట్టమంటున్నారు. కేసు పెడితే డ్యూటీలో ఉన్న 9 మంది గన్ మన్లపై కేసు పెట్టాలి. వారితో పాటు ఓ ఎస్సై కూడా సస్పెండ్ అవుతాడు. దాంతో నాకేం వస్తుంది? ఒకవేళ ఆ పోలీసులు మళ్లీ ఉద్యోగాల్లో చేరినా వాళ్ల రికార్డుల్లో రెడ్ మార్కు పడుతుంది. ఇది పద్ధతి కాదు... పోలీసులు తమ వైఖరి మార్చుకోవాల్సిందే. లేకపోతే ఏపీ సర్వనాశనం అవుతుంది. న్యాయం జరిగేది మీవల్లే. నాకు న్యాయం జరగకపోయినా ఫర్వాలేదు... నేను ఎక్కడైనా బతకగలను. ఆరు టైర్లుంటే చాలు, డ్రైవర్ గానో, క్లీనర్ గానో పనిచేసి బతకగలను. ఇక్కడందరూ అలా బతకగలరా? నేను ఎవరినీ తిట్టదలుచుకోలేదు. కానీ అధికారులకు నేను చెప్పేదొక్కటే. మీ డ్యూటీ మీరు చేయండంతే. నా పర్మిట్లు ఎలా రావు? ఎందుకు రావు నా పర్మిట్లు? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి... సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు... పర్మిట్లు తప్పకుండా వస్తాయి" అంటూ వ్యాఖ్యానించారు.