East Godavari District: అంతర్వేది లక్ష్మీనరసింహుడి కొత్త రథం సిద్ధం.. నేడు ట్రయల్ రన్
- మూడు నెలల క్రితం కాలిబూడిదైన రథం
- మరో 15 రోజుల్లో రథానికి రంగులు
- భీష్మ ఏకాదశి నాడు రథోత్సవం
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి నూతన రథం సిద్ధమైంది. నేడు ఈ రథానికి ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఏవైనా లోపాలు బయటపడితే తిరిగి సరిచేయనున్నారు. మరో 15 రోజుల్లో రంగులు కూడా వేసి పూర్తిగా సిద్ధం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి రథాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రథం మూడు నెలల్లోనే సిద్ధం కావడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. భీష్మ ఏకాదశినాడు రథోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
సెప్టెంబరులో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ రథం అగ్నికి ఆహుతైంది. ఆలయ ప్రాంగణంలోని షెడ్డులో భద్రపరిచిన రథానికి అర్ధరాత్రివేళ మంటలు అంటుకోవడంతో పూర్తిగా కాలి బూడిదైంది. 40 అడుగుల ఎత్తుండే ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. రథం అగ్ని ప్రమాదానికి గురికావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. దీంతో స్వామి వారికి కొత్త రథ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం మూడు నెలల్లోనే దానిని సిద్ధం చేసింది.