Chidambaram: శరద్ పవార్ కూడా కోరుకోవడం లేదు: చిదంబరం
- యూపీఏకు శరద్ పవార్ అధ్యక్షుడవుతారని వార్తలు
- ఆయన పెద్ద పదవులను కోరుకోవడం లేదు
- అందరికీ ఆమోదయోగ్యుడు చైర్ పర్సన్ అవుతారు
- ట్విట్టర్ లో మాజీ ఆర్థికమంత్రి చిదంబరం
యూపీఏకు శరద్ పవార్ అధ్యక్షుడు అవుతారని వార్తలు వస్తున్న వేళ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.
కనీసం శరద్ పవార్ కూడా తాను యూపీఏ చైర్ పర్సన్ కావాలని కోరుకోవడం లేదని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయనకు ప్రధాని పదవిని చేపట్టాలని కూడా లేదని అన్నారు. దేశంలో అతిపెద్ద పార్టీలో భాగస్వాములుగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకుల్లో సమర్ధుడైన, అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని యూపీఏ చైర్ పర్సన్ గా సీనియర్లు ఎంపిక చేస్తారని చిదంబరం వ్యాఖ్యానించారు. తామేమీ ప్రధానమంత్రిని ఎంపిక చేయబోమని అన్నారు.
కాగా, యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కీలక సమావేశానికి సిద్ధమవుతున్న వేళ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సమావేశం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతుండగా, యూపీఏలో భాగంగా ఉన్న పార్టీలను ఏకతాటిపై ఉంచడంతో పాటు, కొత్త చైర్ పర్సన్ ను ఎన్నుకోవడం లక్ష్యంగా సాగనుంది. భాగస్వామ్య పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలని, మరింత బలంగా ఎదగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చిదంబరం వ్యాఖ్యానించారు. యూపీఏలోని మిగతా పార్టీలతో పోలిస్తే, పార్లమెంట్ లో అత్యధిక సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు కాబట్టి, ఈ సమావేశం కాంగ్రెస్ నేత అధ్యక్షతన జరుగుతుందని ఆయన అన్నారు.