Pawan Kalyan: మీరు పేకాట క్లబ్బులు, సిమెంటు ఫ్యాక్టరీలు నడుపుకోవచ్చు కానీ, నేను సినిమాలు చేసుకోకూడదా?: పవన్ కల్యాణ్
- గుడివాడలో పవన్ పర్యటన
- పవన్ ర్యాలీకి విశేష స్పందన
- తాను సినిమాలు ఎందుకు చేయకూడదని ప్రశ్నించిన పవన్
- వ్యాపారాలన్నీ మీకే ఉండాలా అంటూ ఆగ్రహం
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. పవన్ రాకతో గుడివాడ జనసంద్రాన్ని తలపించింది. ఆయన రోడ్ షోకు విశేష స్పందన వచ్చింది. గుడివాడ సెంటర్లో పవన్ కల్యాణ్ ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, తాను సినిమాలు చేయడాన్ని చాలామంది విమర్శిస్తున్నారని అన్నారు. పేకాట క్లబ్బులు నడుపుకుంటూ రాజకీయాలు చేసేవాళ్లున్నప్పుడు తాను సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సిమెంటు ఫ్యాక్టరీలు నడుపుకుంటూ రాజకీయాలు చేసేవాళ్లున్నప్పుడు తాను సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు ఎందుకు చేయకూడదని నిలదీశారు.
"నన్ను విమర్శించే వాళ్లందరూ పాపం ఖద్దరు కట్టుకుని కేవలం రాజకీయాలే చేస్తుంటారు. కొల్లాయి ధరించి రాజకీయం తప్ప ఇంకే చేయరండి. వాళ్ల దగ్గర డబ్బులు కూడా లేవండీ పాపం. అనుక్షణం 'మా ప్రజలు మా ప్రజలు' అనుకుంటూ రోడ్లపై తిరుగుతుంటారు. వాళ్లు కేవలం ప్రజాక్షేమం కోసం రాజకీయాలు చేస్తుంటారు. ప్రజల కోసమే మీరు పనిచేస్తుంటే మీకు ఫ్యాక్టరీలు దేనికమ్మా! మీరు కాంట్రాక్టులు ఎందుకు తీసుకుంటున్నారు?
మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ వేల కోట్లు మీరు దోచేసుకోవచ్చు. నేను మాత్రం సినిమాలు చేసుకోకూడదా? మైనింగ్ కంపెనీలు, వ్యాపారాలు, మీడియా సంస్థలు అన్నీ మీకే ఉండాలా? మేం మాత్రం మీకు ఊడిగం చేయాలా? మీ దాష్టీకాలను భరించాలా? ఆ రోజులు పోయాయి. అవి పాత రోజులు. ఎదురుతిరిగే రోజులివి. ఇప్పుడు మీరు మా చొక్కా పట్టుకుంటే మేం మీ చొక్కా పట్టుకుంటాం" అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.