Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆన్ లైన్లో రూ.100 కోట్ల విరాళాలు
- అంచనాలు వెల్లడి చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు
- మందిరం నిర్మాణానికి రూ.1,100 కోట్లు అవసరమని అంచనా
- ప్రధాన ఆలయానికి రూ.400 కోట్ల వ్యయం
- ఆలయాన్ని మూడున్నరేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయం
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భారీ విరాళాలు వచ్చాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణ ఖర్చుల అంచనా వివరాలను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇవాళ విడుదల చేసింది. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి మొత్తం రూ.1,100 కోట్లు అవసరమని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయోధ్య ప్రధాన ఆలయానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు వ్యయం అవుతుందని ట్రస్టు వెల్లడించింది.
అయోధ్యలో రామాలయాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. నిపుణుల సారథ్యంలో ఆలయ ఆకృతులు రూపొందిస్తున్నామని వివరించింది. రామాలయ ఆకృతుల రూపకల్పనలో ఐఐటీలు, ఇతర సంస్థల సాయం తీసుకోనున్నట్టు వెల్లడించింది. రామ మందిరం నిర్మాణం కోసం ఇప్పటివరకు ఆన్ లైన్ లో రూ.100 కోట్ల వరకు విరాళాలు వచ్చినట్టు ట్రస్టు స్పష్టం చేసింది.