Diego Maradona: నిలువెత్తు మారడోనా ప్రతిమ.. కేకు రూపంలో అభిమానం
- ఫుట్ బాల్ దిగ్గజానికి తమిళనాడు బేకరీ నివాళి
- 60 కిలోల చక్కెర, 270 కోడిగుడ్ల వినియోగం
- 4 రోజులు శ్రమించి ఆరడుగుల ప్రతిమకు రూపం
డయీగో మారడోనా.. ప్రపంచం మెచ్చిన ఫుట్ బాల్ దిగ్గజం అతడు. ప్రాంతంతో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానులు అతడి సొంతం. మన దేశంలోనూ అలాంటి వారు చాలా మందే ఉన్నారు. ఆ అభిమానాన్ని తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఓ బేకరీ కేకు రూపంలో చాటుకుంది. సాదాసీదాగా చేస్తే ఆ అభిమానంలో ప్రత్యేకత ఏముంటుంది? అందుకే ఆరడుగుల ఎత్తుతో మారడోనా ‘కేకు ప్రతిమను’ తయారు చేసి.. షాపు బయట నిలబెట్టింది.
దీని కోసం 60 కిలోల చక్కెర, 270 కోడిగుడ్లను బేకరీ వాడింది. నాలుగు రోజుల పాటు శ్రమించి కేకు ప్రతిమకు మారడోనా రూపు తీసుకొచ్చింది. ‘‘ఏటా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రముఖుల కేకు ప్రతిమలను తయారు చేయడం మాకు పరిపాటి. కొన్నేళ్లుగా ఇళయరాజా, అబ్దుల్ కలాం, భారతీయార్ వంటి మహామహుల విగ్రహాలను తయారు చేసి షాపు బయట నిలెబట్టాం’’ అని సతీశ్ రంగనాథన్ అనే బేకరీ ఉద్యోగి చెప్పారు.
గుండెపోటుతో చనిపోయిన మారడోనాకు నివాళిగా ఇప్పుడు ఈ కేకు ప్రతిమను రూపొందించామన్నారు. పిల్లలు, యువత మొబైల్ ఫోన్ లో ఆటలు ఆడకుండా.. మైదానంలో ఆడాలని పిలుపునిచ్చారు. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, పరుగులో ఉసేన్ బోల్ట్, బాక్సింగ్ లో మైక్ టైసన్ ను గుర్తుపెట్టుకున్నట్టే.. మారడోనానూ స్మరించుకుంటారని చెప్పారు.
నవంబర్ 25న మారడోనా తన నివాసంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు నుంచే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుంగుబాటుకు లోనైన ఆయన్ను అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. మెదడులో రక్తస్రావం కావడంతో శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించింది.