Sanjay Raut: ఈడీ విచారణకు హాజరుకాని సంజయ్ రౌత్ భార్య
- పీఎంబీ మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ భార్య
- జనవరి 5 వరకు తనకు సమయం కావాలని కోరిన వర్ష రౌత్
- 120 మంది బీజేపీ నేతలు ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న సంజయ్ రౌత్
పీఎంబీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో శివసేన కీలక నేత సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సమన్లలో పేర్కొన్న మేరకు ఈ రోజు ఆమె ముంబైలోని ఈడీ కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈడీ విచారణకు ఆమె హాజరుకాలేదు. జనవరి 5 వరకు తనకు సమయం కావాలని ఈడీ అధికారులను ఆమె కోరినట్టు ఏఎన్ఐ తెలిపింది. గతంలో సమన్లు పంపినప్పుడు కూడా అనారోగ్య కారణాలతో ఆమె విచారణకు హాజరుకాలేదు.
మరోవైపు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, బాలాసాహెబ్ థాకరేకు చెందిన శివసైనికుడినని చెప్పారు. బీజేపీ నేతల నిజస్వరూపాలను, అవినీతిని తాను బయటపెడతానని అన్నారు. మనీలాండరింగ్ కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో 120 మంది బీజేపీ నేతలు ఉన్నారని చెప్పారు.నీరవ్ మోదీ, విజయ్ మాల్యా మాదిరి బీజేపీ నేతలు విమానాలెక్కి విదేశాలకు చెక్కేయాలని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థిని ముఖాముఖి ఎదుర్కోవడం చేతకానప్పుడు ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతారని విమర్శించారు.