Nara Lokesh: చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్న చిన్నారులను చూసి చాలా బాధేసింది: నారా లోకేశ్
- ప్రకాశం జిల్లాలో లోకేశ్ పర్యటన
- యడవల్లి గ్రామంలో ఇటీవల టీడీపీ కార్యకర్త తెల్లమేకల శ్రీను మృతి
- శ్రీను కుటుంబానికి లోకేశ్ ఆత్మీయ పరామర్శ
- చిన్నారుల చదువు బాధ్యతలు టీడీపీ స్వీకరిస్తుందని హామీ
ప్రకాశం జిల్లా యడవల్లిలో ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త తెల్లమేకల శ్రీను కుటుంబాన్ని పార్టీ అగ్రనేత నారా లోకేశ్ ఇవాళ పరామర్శించారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న లోకేశ్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని యడవల్లి వెళ్లారు. అక్కడ తెల్లమేకల శ్రీనుకు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శించారు. దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. ఇటీవల మృతి చెందిన తెల్లమేకల శ్రీను పిల్లల బాధ్యతలను టీడీపీ స్వీకరిస్తుందని లోకేశ్ తెలిపారు. చాలా చిన్నవయసులో తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారులను చూసి చాలా బాధేసిందని తెలిపారు. కుటుంబానికి ఆర్థికసాయంతో పాటు ఆ చిన్నారుల చదువును ఇకపై టీడీపీ చూసుకుంటుందని వారికి భరోసా ఇచ్చానని వెల్లడించారు.
అటు, వర్షాల కారణంగా మిర్చి పంట నష్టపోయిన రైతులను కూడా లోకేశ్ పరామర్శించారు. రైతు కోసం కార్యక్రమంలో భాగంగా ఆయన యడవల్లి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. పంటల నష్టం తాలూకు వివరాలు ప్రభుత్వానికి పంపినా డ్యామేజి లిస్టులో లేకపోవడంతో ఇక్కడి రైతులకు నష్టపరిహారం రాలేదని రైతు భరోసా కేంద్రం సిబ్బంది చెప్పారని లోకేశ్ వెల్లడించారు. పంట నష్టం జరిగిన విషయాన్ని ఎవరైనా వచ్చి పరిశీలించాలని, అలా కాకుండా పంట నష్టం అంచనాలు వేయలేనప్పుడు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వలంటీర్లు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.