America: అమెరికాలోనూ కాలుమోపిన బ్రిటన్ వైరస్.. ఎక్కడికీ వెళ్లని వ్యక్తిలో గుర్తింపు!
- కొలరాడో వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్ గుర్తింపు
- బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
- వ్యాప్తిని అడ్డుకుంటామన్న గవర్నర్
బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్ నెమ్మదిగా సరిహద్దులు దాటుతోంది. ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో అడుగుపెట్టిన ఈ వైరస్ అమెరికాలో ఆశ్చర్యకరంగా గత కొంతకాలంగా ఎక్కడికీ ప్రయాణించని యువకుడిలో కనిపించింది. డెన్వర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడిలో ఈ కొత్త వైరస్ లక్షణాలు వెలుగుచూసినట్టు కొలరాడో గవర్నర్ జేర్డ్ పొలిస్ తెలిపారు. ఇటీవలి కాలంలో అతడు ఎక్కడికీ ప్రయాణించకున్నా కొత్త వైరస్ సోకడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో అతడి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించేందుకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రంగంలోకి దిగింది.
ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నట్టు చెబుతున్నారని, అయితే ఈ వైరస్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలను సేకరించి వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటామని చెప్పారు. మరోవైపు, కొత్త వైరస్ వెలుగుచూడడంతో అప్రమత్తమైన అమెరికా.. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు తమకు కొవిడ్ సోకలేదని నిర్ధారించే ధ్రువపత్రాన్ని చూపించాలని నిబంధన విధించింది.