Kumar Swamy: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ ఆత్మహత్యపై కుమారస్వామి స్పందన
- చైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లి అవమానించారు
- ఇది రాజకీయ కుట్రే
- నిజనిర్ధారణ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టాలి
కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ ఆత్మహత్యపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. రాజకీయ కుట్రకు ఆయన బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. విధాన పరిషత్‌లో జరిగిన ఘటనలు ఆయనను కలచివేశాయన్నారు. చైర్మన్ సీటు నుంచి కిందికి లాక్కెళ్లి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఇది రాజకీయ కుట్ర అని, నిజనిర్ధారణ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టాలని కుమారస్వామి డిమాండ్ చేశారు.
శాసనమండలి చైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఈ నెల 15న శాసనమండలిలో రభస జరిగింది. సభ్యులు ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లడం వివాదాస్పదమైంది. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ధర్మెగౌడ ఆచూకీ ఆ తర్వాత తెలియరాలేదు. దీంతో పోలీసులు, గన్‌మెన్ ఆయన కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
నిన్న తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు. రైలు కిందపడి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పక్కనే ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.