Raghu Rama Krishna Raju: ఆలయాలపై దాడుల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి రఘురామకృష్ణరాజు లేఖ
- వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేవాలయాల ధ్వంసాలు
- 100కు పైగా హిందూ ఆలయాలపై దాడులు
- నిన్న రామతీర్థం శ్రీరాముడి విగ్రహం ధ్వంసం
- కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలి
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో రామతీర్థం రామగిరిపై శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీలో దేవాలయాలపై దాడులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఓ లేఖ రాశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతోందని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ హిందూ దేవాలయాలపై దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 100కు పైగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని, ఇటీవల మూడు ఆలయాల్లో రథాలను తగులబెట్టారని గుర్తు చేశారు.
నిన్న రామతీర్థం రామగిరిపై శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. హిందూ సంస్థల వారు నిరసన తెలపకుండా అడ్డుకుంటున్నారని, దానికి కరోనా కారణం చెబుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలకు మాత్రం వేలాది మందికి రోడ్లపై ర్యాలీలు తీయడానికి అనుమతులు ఇస్తున్నారని, ఏపీలో ఆలయాల ధ్వంసంపై కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆయన కోరారు.