jong shanshan: ఆసియాలో అత్యంత ధనవంతుడి స్థానాన్ని కోల్పోయిన ముకేశ్ అంబానీ... కారణం టీకా, మంచినీరు!
- 77.8 బిలియన్ డాలర్లతో తొలి స్థానం
- ప్రస్తుతం వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో 11వ ప్లేస్ లో
- చైనా వ్యాక్సిన్ కంపెనీకి అధిపతిగా ఉన్న జాంగ్ షాన్ షాన్
- ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వ్యాక్సిన్ కంపెనీల విలువ
ఆసియాలో అత్యంత ధనవంతుడి హోదాను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కోల్పోయారు. ఇప్పుడు ఆసియా కుబేరుడు జాంగ్ షాన్ షాన్. ఈ సంవత్సరం ఆయన ఆస్తుల విలువ 7 బిలియన్ డాలర్లకు పైగా పెరుగగా, గతంలో టాప్-5లో ఉన్న ఆయన, ఏకంగా నంబర్ వన్ స్థానానికి చేరారు. జాంగ్ మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం 77.8 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడాయన ప్రపంచంలోని కుబేరుల్లో 11వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు పెరగడానికి కారణం జాంగ్ షాన్ షాన్ అధీనంలో ఓ వ్యాక్సిన్ కంపెనీ, మరో మంచినీటి సరఫరా కంపెనీ నడుస్తూ ఉండటమే.
ఆయన అధీనంలోని వ్యాక్సిన్ సంస్థ బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్, గడచిన ఏప్రిల్ లో చైనా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయింది. ఆపై నెలల వ్యవధిలోనే తన వాటర్ బాట్లింగ్ సంస్థ నాంగ్ఫూ స్ప్రింగ్ వాటాల విక్రయం ద్వారా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించారు. ఆ సమయానికి చైనాకు చెందిన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఆసియాలో అత్యంత ధనవంతునిగా ఉన్నారు.
ఆపై జాక్ మా స్థానాన్ని, రిలయన్స్ జియో కాపిటల్స్, రిలయన్స్ రిటైల్ లోకి వచ్చిన పెట్టుబడులతో ముకేశ్ అంబానీ ఆక్రమించగా, ఇప్పుడు ఈ ఇద్దరినీ షాన్ షాన్ అధిగమించారు. ముఖ్యంగా, వాంటాయ్ బయోలాజికల్ ఈక్విటీ విలువ దాదాపు 2000 శాతం పెరగడం ఆయన ఆస్తులను గణనీయంగా పెంచింది. ఇదే సమయంలో తొలిరోజు లిస్టింగ్ లోనే వాంగ్సూ స్ప్రింగ్స్ ఈక్విటీ 155 శాతం పెరిగింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య ప్రస్తుతం ఆసియాలో అత్యధిక ధనవంతునిగా జాంగ్ నిలిచారు.