Bandi Sanjay: గురువుల పేరు వింటే కేసీఆర్ గారి గుండెల్లో గుబులు పుడుతోంది: బండి సంజయ్
- టీచర్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శలు
- ఆత్మగౌరవ ఉద్యమంలో టీచర్లదే కీలకపాత్ర అని వెల్లడి
- టీచర్లను చర్చలకు పిలవకపోవడమేంటన్న బండి సంజయ్
- ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిందేనని డిమాండ్
ఉపాధ్యాయుల విషయంలో కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉపాధ్యాయులను పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర చిరస్మరణీయం అని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలవడం సంతోషించదగ్గ పరిణామం అని, కానీ ఉపాధ్యాయులను ఎందుకు చర్చలకు దూరంగా ఉంచుతున్నారని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఉపాధ్యాయులకు ఎలక్షన్ బాధ్యతలు ఇవ్వకుండా దూరం పెట్టారని ఆరోపించారు. దీన్నిబట్టి ఉపాధ్యాయులపై కేసీఆర్ చూపిస్తున్న వివక్ష బట్టబయలైందని వెల్లడించారు. గురువుల పేరు వింటేనే కేసీఆర్ గుండెల్లో గుబులు పుడుతోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఐదేళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీని ఎందుకు గౌరవించడంలేదు? రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదు? అని ప్రశ్నించారు. సమాజం యొక్క భవిష్యత్తు విద్యార్థుల తరగతి గది నాలుగు గోడల మధ్యనే నిర్ణయమవుతుందని, అలాంటి దైవసమానమైన వృత్తిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమని బండి సంజయ్ విమర్శించారు.
భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను వేధించకుండా వారిని చర్చలకు పిలిచి వారి న్యాయపరమైన కోరికలను, సమస్యలను పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ నిలుస్తుందని, ప్రభుత్వాన్ని యూ టర్న్ తిప్పి మరీ ఉపాధ్యాయులకు న్యాయం చేసేదాకా విశ్రమించబోమని వెల్లడించారు.