Narendra Modi: సూరీడు ఇప్పుడే ఉదయించాడు.. వైరల్ అవుతున్న ప్రధాని మోదీ కవిత!
- వీడియోను ట్వీట్ చేసిన మై గవ్ ఇండియా
- కొత్త సంవత్సరం తొలి రోజు స్ఫూర్తినిచ్చే వీడియో అని వ్యాఖ్య
- డాక్టర్లు, రైతులు, సైనికులను ప్రస్తావించిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ రాసిన కవిత నెట్టింట వైరల్ అవుతోంది. నూతన సంవత్సరాది సందర్భంగా ఆ కవిత వీడియోను ‘మై గవ్ ఇండియా’ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రధాని పద్యంతో కొత్త సంవత్సరంలో మొదటి రోజును ప్రారంభిద్దామంటూ ‘సూరీడు ఇప్పుడే ఉదయించాడు’ అంటూ ప్రధాని రాసిన ఆ కవితను ట్వీట్ చేసింది.
వీడియోలో కరోనాతో పోరులో ముందున్న వైద్యులు, సరిహద్దుల్లో నిరంతరం దేశాన్ని కాచుకుంటున్న సైనికులు, మహిళలు, రైతుల గురించి ప్రస్తావించారు. ఆ కవిత సారం ఇదీ...
‘‘సూరీడు ఇప్పుడే ఉదయించాడు..
నింగివైపు తలెత్తుకుని..
అలముకున్న మేఘాలను చీల్చుకుని..
వెలుగులద్దే సంకల్పంతో..
సూరీడు ఇప్పుడే ఉదయించాడు..
దృఢ నిశ్చయంతో ముందుకెళుతూ..
కష్టనష్టాలను ఎదుర్కొంటూ..
కారు చీకట్లను చీల్చుతూ..
సూరీడు ఇప్పుడే ఉదయించాడు..
విశ్వాసాన్ని నింపుతూ..
అభివృద్ధి వెలుగులు చిందిస్తూ..
కలలను నిజం చేస్తూ..
సూరీడు ఇప్పుడే ఉదయించాడు..
తన, పర భేదం చూపకుండా..
నువ్వు..నేను అన్న తేడా లేకుండా..
అందరికీ వెలుగులు పంచుతూ..
సూరీడు ఇప్పుడే ఉదయించాడు..
చండ్ర నిప్పులతో ప్రకాశాన్ని రగిలిస్తూ..
ముందుకు నడుస్తూ.. నడిపిస్తూ..
సూరీడు ఇప్పుడే ఉదయించాడు” అంటూ సాగింది ప్రధాని కవిత.