Vishnu Vardhan Reddy: రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం క్షమించరాని నేరం: విష్ణువర్ధన్ రెడ్డి
- ఏపీలో పెరుగుతున్న విగ్రహ ధ్వంసం ఘటనలు
- తాజాగా రాజమండ్రిలో ఘటన
- సుబ్రహ్మణ్యేశ్వరస్వామి చేతుల నరికివేత
- సీఎం జగన్ రాజీనామా చేయాలన్న విష్ణువర్ధన్ రెడ్డి
ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు సరికదా, నానాటికీ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం రెండు చేతులను దుండగులు ధ్వంసం చేయడం తెలిసిందే. పట్టణంలోని శ్రీరామనగర్ లో ఉన్న వినాయక ఆలయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం క్షమించరాని నేరం అని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ప్రతి రోజు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అయినప్పటికీ సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. హిందువులను, హిందూ విగ్రహాలను, హిందువుల పవిత్ర స్థలాలను సీఎం జగన్ గనుక రక్షించలేకపోతే, ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.