Gavaskar: గెట్ లాస్ట్ అన్నందుకే అప్పుడు వాకౌట్ చేశాం: నాటి సంఘటన చెప్పిన గవాస్కర్
- భారత్-ఆస్ట్రేలియా మధ్య 1981లో మెల్బోర్న్ లో టెస్టు
- ఆస్ట్రేలియా ఆటగాళ్లు నోరుపారేసుకున్నారు
- అందుకే కోపం వచ్చింది
- అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అసంతృప్తి చెందలేదు
భారత్-ఆస్ట్రేలియా మధ్య 1981లో మెల్బోర్న్ లో జరిగిన టెస్టులో జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పలు విషయాలు తెలిపారు. తమను ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ‘గెట్ లాస్ట్’ అన్నారని, అందుకే తాము అప్పట్లో వాకౌట్ చేశామని, అంతేగానీ, అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అసంతృప్తితో కాదని వివరించారు.
అప్పటి మెల్బోర్న్ టెస్టులో డెన్నిస్ లిల్లీ ఇన్ కట్టర్ విసిరిన బాల్ గవాస్కర్ ముందు ప్యాడ్‌ను తాకడమే కాకుండా బ్యాటును కూడా తాకింది. అయినప్పటికీ అంపైర్ రెక్స్ వైట్‌హెడ్ ఎల్బీగా ఔటిచ్చారు. దీంతో ఆ సమయంలో గవాస్కర్ చాలాసేపు మైదానంలోనే ఉండిపోయి, నిరసన తెలిపారు. అయితే, ఆయన నిర్ణయంపై అసంతృప్తి చెందానని చాలా మంది అనుకున్నారని అన్నారు.
తాను అసంతృప్తి చెందని విషయం వాస్తవమే అయినప్పటికీ వాకౌట్కు మాత్రం అది కారణం కాదని గవాస్కర్ చెప్పారు. తాను డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు గెట్ లాస్ట్ అంటూ వ్యాఖ్యలు చేయడంతో కోపం వచ్చి దీంతో వెనక్కి వచ్చి తోటి బ్యాట్స్ మన్ చేతన్‌ను తనతో వచ్చేయమని చెప్పానని తెలిపారు. దీంతో మైదానంలోంచి చేతన్ వాకౌట్ చేశాడని, అప్పట్లో బాల్ బ్యాటును తాకిన విషయం ఆసీస్ ఫార్వర్డ్ షార్ట్‌లెగ్ ఫీల్డర్‌కు కూడా తెలుసని, అందుకే అతడు అప్పీల్ చేయలేదని అన్నాడు. కాగా, అప్పట్లో అంపైర్లు జోక్యం చేసుకుని నచ్చచెప్పడంతో తిరిగి టీమిండియా బ్యాటింగ్ కొనసాగించింది.