SP Rajakumari: రామతీర్థం ఘటనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు... రాజకీయ పార్టీలకు ఎస్పీ రాజకుమారి వార్నింగ్
- రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సు ఖండన
- సంచలనం సృష్టించిన ఘటన
- రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు
- ఘటనపై విచారణ జరుపుతున్నామన్న ఎస్పీ
- నేతలు సంయమనం పాటించాలని సూచన
విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును ఖండించిన ఘటన తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రామతీర్థం రానుండగా, ఇప్పటికే అక్కడ బీజేపీ, వైసీపీ, టీడీపీ నేతలు శిబిరాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి రాజకీయ పక్షాలకు హెచ్చరికలు జారీ చేశారు. రామతీర్థం ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేశారు. ఎవరైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని అన్నారు.
రామతీర్థంలో డిసెంబరు 29న సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని, అయితే ఒకరోజు ముందు డిసెంబరు 28న దుండగులు విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డారని రాజకుమారి తెలిపారు. ఈ ఘటనలో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని అన్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోందని, ఈ ఘటనకు సంబంధించి 20 మందిని విచారిస్తున్నామని తెలిపారు. రాజకీయ నేతలు ఈ సమయంలో సంయమనం పాటించాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు.