Facebook: వాట్సాప్ కు నూతన సంవత్సర జోష్.. ఒక్క రాత్రే 140 కోట్లకుపైగా వాయిస్, వీడియో కాల్స్!
- ఫేస్ బుక్ లోనూ ఐదున్నర కోట్లకు పైగా ప్రత్యక్ష ప్రసారాలు
- రెండు రెట్లు పెరిగిన మెసెంజర్ వీడియో కాల్స్
- సమస్యల పరిష్కారానికి ఇంజనీరింగ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్న వాట్సాప్
నూతన సంవత్సరం అనగానే అందరికీ ఎక్కడలేని జోష్ వచ్చేస్తుంది. కానీ, ఈ సారి వేడుకలకేమో కరోనా ఆంక్షలు అడ్డొచ్చి పడ్డాయి. దాంతో దాదాపు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. చాలా మంది స్నేహితులను కలవనేలేదు. అయితే, ఇంట్లో ఉన్నా.. వాట్సాప్ మాత్రం బంధుమిత్రులను చేరువ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. వాట్సాప్ లో ఏకంగా 140 కోట్లకుపైగా వాయిస్, వీడియో కాల్స్ చేశారట. ఇటు ఫేస్ బుక్ లోనూ దాదాపు ఐదున్నర కోట్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగాయట. దానికి సంబంధించిన డేటాను ఫేస్ బుక్ సాంకేతిక ప్రోగ్రామ్ మేనేజర్ కైట్లిన్ బాన్ ఫోర్డ్ తన బ్లాగ్ లో వెల్లడించారు.
గత ఏడాదితో పోలిస్తే వాట్సాప్ కాలింగ్ దాదాపు 50 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇటు ఫేస్ బుక్ మెసెంజర్ లోనూ వీడియో కాల్స్ ఎక్కువయ్యాయన్నారు. మామూలు రోజులతో పోలిస్తే సగటున రెండు రెట్లు పెరిగాయన్నారు. ఫేస్ బుక్ లో మెసేజ్ లు, ఫొటో పోస్టింగ్ లు పెరిగాయన్నారు. పెరిగిన ట్రాఫిక్ కు తగ్గట్టు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఇంజనీరింగ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, వచ్చిన సమస్యను వచ్చినట్టు పరిష్కరించామని వెల్లడించారు.