Buta Singh: కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్ కన్నుమూత
- గతేడాది అక్టోబరు నుంచి కోమాలో ఉన్న బూటా సింగ్
- ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స
- ఈ ఉదయం మృతి
- సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
- రాజీవ్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన బూటా సింగ్
కాంగ్రెస్ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి బూటా సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గతేడాది అక్టోబరు నుంచి బూటా సింగ్ కోమాలో ఉన్నారు. మెదడులో రక్తస్రావం జరగడంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. అప్పటినుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం తన తండ్రి తుదిశ్వాస విడిచారని బూటా సింగ్ తనయుడు అర్విందర్ సింగ్ లవ్లీ సిద్ధు సోషల్ మీడియాలో వెల్లడించారు.
కాగా, బూటా సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. బూటా సింగ్ అపార అనుభవశాలి అని, పేదల, అట్టడుగువర్గాల సంక్షేమం కోసం బలంగా గొంతుక వినిపించారని మోదీ కొనియాడారు. ఆయన మరణం తనను విషాదానికి గురిచేసిందని తెలిపారు.
పంజాబ్ కు చెందిన బూటా సింగ్ జాతీయ స్థాయిలో దళిత నేతగా గుర్తింపు పొందారు. ఆయన రాజీవ్ గాంధీ హయాంలో 1986 నుంచి 89 వరకు కేంద్రమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలను పర్యవేక్షించారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం నుంచే బూటా సింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.