Andhra Pradesh: ఏపీలో ఒక్కొక్కరిపై తలసరి అప్పు రూ. 70 వేలు!
- బడ్జెట్ నిర్వహణలో భాగంగా అప్పులు
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తేలాల్సిన మరో నాలుగు నెలల లెక్కలు
- పలు మార్గాల ద్వారా రుణాలు చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకూ రూ. 13 వేల కోట్ల రుణ భారంలో మునిగిపోగా, రాష్ట్రంలోని ప్రజల్లో ఒక్కొక్కరిపై రూ. 70 వేల తలసరి అప్పు ఉన్నట్టు లెక్కలు తెలుపుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్ నిర్వహణలో భాగంగా నవంబర్ వరకూ వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 73,811 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకోగా, మరో నాలుగు నెలల లెక్కలు తేలాల్సి వుంది. ఇప్పటివరకూ ఉన్న గణాంకాలతోనే తలసరి అప్పు రూ. 70 వేలుగా ఉండగా, మిగతా నాలుగు నెలల లెక్కలు బయటకు వస్తే, ఇది మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 5.39 కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్నారు. ఈ సంవత్సరం చేసిన అప్పును అందరి పైనా మోపితే రూ. 13,694 వరకూ తేలుతుండగా, ఇప్పటివరకూ ఏపీ చేసిన అప్పులను లెక్కిస్తే, అది ఒక్కొక్కరిపై రూ. 70 వేల వరకూ ఉండబోతోంది. ఈ విషయంలో అధికారిక లెక్కలు ఇంకా తేలాల్సి వుంది. బహిరంగ మార్కెట్ తో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, ప్రావిడెంట్ ఫండ్, చిన్న మొత్తాల పొదుపు, రుణ, ఇతర సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం అప్పులు చేసింది.
వాస్తవానికి ఏడాదిలో రెవెన్యూ మొత్తం ఆదాయం మీద 90 శాతం దాటకుండా అప్పులు ఉండేలా చూసుకోవాల్సి వుంటుంది. అయితే, 2019 ఏప్రిల్ తరువాత 20 నెలల్లో ఏపీ చేసిన అప్పు రూ. లక్ష కోట్లను దాటిందని ప్రభుత్వ లెక్కలు తేలుస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 45 వేల కోట్లను రుణంగా తీసుకున్న ప్రభుత్వం, ఈ సంవత్సరం నవంబర్ వరకూ రూ. 73 వేల కోట్లు సమీకరించింది. డిసెంబర్ లెక్కలు రావాల్సి వుండగా, మార్చిలోగా మరిన్ని రుణాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అధికారులు అంటున్నారు.
ఇక గత ఆర్థిక సంవత్సరం లెక్కలు పరిశీలిస్తే, బహిరంగ మార్కెట్ ద్వారా రూ. 1.88 లక్షల కోట్లు, కేంద్రం నుంచి రుణాల రూపంలో రూ. 10.532 కోట్లు, ఇతర సంస్థల నుంచి రూ. 15,465 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు సంస్థల నుంచి రూ.11,331 కోట్లు, పీఎఫ్ ఖాతాల నుంచి రూ. 16,500 కోట్లు, డిపాజిట్లు, రిజర్వ్ నుంచి రూ. 59,552 కోట్ల రుణాలను ప్రభుత్వం తీసుకుంది. ఈ మొత్తం 3.02 లక్షల కోట్లను దాటగా, ఆపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తీసుకున్న రుణాల అంచనాలు రూ.3.48 లక్షల కోట్లను అధిగమించాయని తెలుస్తోంది.