Swami Swaroopanandendra: ఇలాంటి ఘటనలను ఉపేక్షిస్తే దేవాదాయశాఖ ప్రతిష్ఠ దిగజారుతుంది: శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర
- ఏపీలో కొనసాగుతున్న ఆలయాలపై దాడులు
- ఆందోళన వ్యక్తం చేసిన స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
- నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్
- కమిటీకి కాలపరిమితి విధించాలని స్పష్టీకరణ
ఏపీలో గత కొంతకాలంగా ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, దేవాదాయ ఆస్తులకు నష్టం కలుగజేయడం వంటి ఘటనలు పెచ్చుమీరిపోయాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికివేత వీటికి పరాకాష్టగా చెప్పాలి. ఈ పరిణామాలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తనను కలిసిన సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర రామతీర్థం అంశంపై స్పందించారు.
ఇలాంటి ఘటనలను ఉపేక్షిస్తే దేవాదాయశాఖ ప్రతిష్ఠ దిగజారుతుందని స్పష్టం చేశారు. రామతీర్థం ఘటనపై తక్షణమే నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితిని విధించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇప్పటివరకు వాస్తవాలను వెలికితీయడంలో పోలీసులు విఫలమయ్యారని స్వరూపానందేంద్ర విమర్శించారు.