BTech Ravi: 2018 నాటి కేసులో ఇప్పుడు పట్టుకున్నారు... నేనేమైనా అంతర్జాతీయ నేరస్తుడ్నా: బీటెక్ రవి
- చెన్నై ఎయిర్ పోర్టులో బీటెక్ రవి అరెస్ట్
- 2018 నుంచి పెండింగ్ లో ఉన్న వారంట్
- నేనేమైనా దేశం విడిచి పారిపోతున్నానా అంటూ రవి వ్యాఖ్యలు
- 2018 నుంచి పోలీసులు నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహం
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని చెన్నై ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్టులో తనను అదుపులోకి తీసుకోవడం పట్ల బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ అంతర్జాతీయ నేరస్తుడ్ని కాదని, దేశం విడిచి పారిపోతున్నట్టు వెంబడించి పట్టుకోవడం ఏంటని తీవ్ర అసహనం ప్రదర్శించారు. పోలీస్ స్టేషన్ కు రమ్మంటే నేను వస్తాను కదా అని అన్నారు.
అయినా ఇది 2018 నాటి కేసు అని బీటెక్ రవి తెలిపారు. పైగా వంగలపూడి అనిత ఎస్సీ అయితే, ఆమెపైనా అట్రాసిటీ కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసులకు తాము భయపడేది లేదని, కానీ పోలీసులు 2018 నుంచి నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించారు. 2018లో కడప జిల్లాలోని పులివెందుల పూల అంగళ్ల వద్ద జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో పోలీసులు బీటెక్ రవిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
పులివెందుల అభివృద్ధిపై అప్పట్లో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పర సవాళ్లు నడిచాయి. ఆ ఏడాది జనవరి 4న ఇరువర్గాల చర్చకు ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే, ఉద్రిక్తతల కారణంగా పూల అంగళ్ల వద్ద రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఎస్సై చిరంజీవికి గాయాలు కాగా, ఇరువర్గాలకు చెందిన 253 మందిపై కేసులు నమోదు చేశారు. ఇదే ఘటనకు సంబంధించి బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అప్పటినుంచి ఆయనపై వారంట్ పెండింగ్ లో ఉండగా, ఇవాళ బెంగళూరు నుంచి చెన్నై వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.