Telugudesam: టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభం.. బాలకృష్ణ, నారా లోకేశ్ గైర్హాజరు!
- కొత్త పొలిట్ బ్యూరో సభ్యులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
- దేవాలయాలపై దాడులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ
- హాజరుకాని అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. అంతకు ముందు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, పొలిట్ బ్యూరో సభ్యులు పూలమాల వేసి నివాళి అర్పించారు.
పొలిట్ బ్యూరోలో కొత్తగా స్థానం సంపాదించుకున్న వారికి చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం వారితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పొలిట్ బ్యూరో సమావేశమైంది. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలు, దాడులు, సహజ మరణాలలో చనిపోయిన వారికి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు .
ఈ సమావేశంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక, అమరావతి భవిష్యత్ కార్యాచరణ, రైతుల బస్సు యాత్రకు జాతీయ పార్టీల మద్దతును కూడగట్టడం, పార్టీ సంస్థాగత నిర్మాణం, దేవాలయాలపై వరుస దాడులు, రైతుల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తున్నారు. మరోవైపు పొలిట్ బ్యూరో సమావేశానికి అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు, బాలకృష్ణ, నారా లోకేశ్, బొండా ఉమ, గుమ్మడి సంధ్యారాణి గైర్హాజరయ్యారు.