Jagan: ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు... ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ దాడులు చేస్తున్నారు: సీఎం జగన్

Jagans sensational comments on Hindu Gods idols distruction

  • కొందరికి దేవుడన్నా కూడా భయం లేకుండా పోతోంది
  • విగ్రహాల ధ్వంసం వల్ల ఎవరికి ఉపయోగమో ప్రజలు ఆలోచించాలి
  • రాష్ట్రంలో పొలిటికల్ గెరిల్లా వార్ జరుగుతోంది

రాష్ట్రంలో కొనసాగుతున్న హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరికి దేవుడన్నాకూడా భయం లేకుండా పోతోందని... దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. దుండగులు మారుమూల ప్రాంతాల్లోని విగ్రహాలను ఎంచుకుని ధ్వంసం చేస్తుంటే... ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు.

దేవుడి విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల ఎవరికి లాభమనే విషయాన్ని ప్రజలంతా ఆలోచించాలని అన్నారు. ఎవరిని టార్గెట్ చేసేందుకు ఈ దాడులకు పాల్పడుతున్నారో ఆలోచించాలని చెప్పారు. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ ను జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయని జగన్ అన్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని, పొలిటికల్ గెరిల్లా వార్ జరుగుతోందని చెప్పారు. ఈ కేసులను పోలీసులు సమర్థవంతంగా తేల్చాలని అన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు... ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నాడు-నేడు కార్యక్రమానికి పేరు వస్తోందని 2019లో దుర్గగుడి ధ్వంసం అని ప్రచారం చేశారని, వెండి సింహాలను మాయం చేశారని దుయ్యబట్టారు. దిశ పోలీస్ స్టేషన్లకు వస్తున్న మంచి పేరును అడ్డుకోవడానికి కొన్ని గుడులను ధ్వంసం చేశారని చెప్పారు.

రైతు జలసిరి కార్యక్రమాన్ని మొదలు పెడితే నెల్లూరు జిల్లాలోని ఓ ఆలయంలో విగ్రహం ధ్వంసమయిందని జగన్ మండిపడ్డారు. విద్యా దీవెన కార్యక్రమం ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచే కుట్రలకు తెరలేపారని అన్నారు. కర్నూలులో లక్ష్మీనారాయణస్వామి ఆలయం ఘటన చోటుచేసుకుందని చెప్పారు. బీసీల కోసం చర్యలు చేపట్టినప్పుడు వీరభద్రస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారని అన్నారు. ఇంటి పట్టాలు ఇస్తున్నప్పుడు తిరుమల ఆలయ లైటింగ్ లో ఏసుక్రీస్తు శిలువ అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు. విజయనగరంలో ఇంటి పట్టాలు ఇస్తున్నప్పుడు రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పారు.

  • Loading...

More Telugu News