Jak Ma: జాక్ మా కనిపించడంలేదు... ఏమైపోయాడు?
- రెండు నెలలుగా లేని ఆచూకీ
- గతేడాది అక్టోబరులో చైనా ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేసిన మా
- జాక్ మాపై చైనా ఆగ్రహం
- యాంట్ ఫైనాన్షియల్ ఐపీఓను అడ్డుకున్న వైనం
- 2 నెలల్లో 11 బిలియన్ డాలర్లు నష్టపోయిన మా
ఒకప్పుడు అత్యంత సంపన్నుల జాబితాలో ముందు వరుసలో నిలిచిన చైనా కుబేరుడు, అలీ బాబా సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఇప్పుడు కనిపించడంలేదు. గత రెండు నెలలుగా ఆయన ఆచూకీ లేదు. ఆయన ఆస్తుల విలువ కూడా పడిపోయింది. కొన్నినెలల కిందట 61 బిలియన్ డాలర్లుగా ఉన్న జాక్ మా సంపద ఇప్పుడు 50 బిలియన్ డాలర్లకు కరిగిపోయింది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి.
గతేడాది జాక్ మా చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన పతనానికి దారితీశాయని భావిస్తున్నారు. 2020 అక్టోబరులో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా మాట్లాడుతూ, చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల తరహాలో వ్యవహరిస్తున్నాయని, విస్తృత స్థాయిలో ఆలోచించడం అలవర్చుకోవాలని సూచించారు. అంతేకాదు, చైనా ఆర్థిక వ్యవస్థపై విమర్శనాస్త్రాలు సంధించారు.
దాంతో సహజంగానే ఆగ్రహించిన చైనా అధినాయకత్వం జాక్ మాను టార్గెట్ చేసింది. ఆయన సంస్థలు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా వేసింది. జాక్ మా ఎదిగేందుకు ఉపకరించే చర్యలను అడ్డుకుంది. జాక్ మాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ ఐపీఓను అడ్డుకోవడం ఈ కోవలోకే వస్తుంది.
చైనా ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో జాక్ మాకు గడ్డుకాలం మొదలైంది. ఆస్తులు హరించుకుపోవడం ప్రారంభమైంది. రెండు నెలల్లోనే 11 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంతేకాదు, ఆసలు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియడంలేదు. ఇటీవల ఆయన ఓ టాలెంట్ షో ఫైనల్ ఎపిసోడ్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరించాల్సి ఉండగా, ఆ కార్యక్రమానికి కూడా రాలేదు. దాంతో జాక్ మా అదృశ్యం అంతుచిక్కని ఘటనగా మారింది.