Chandrababu: రామతీర్థం ఘటనలో అసలైన దోషులను పట్టుకోకుండా అమాయకుడైన రామభక్తుడ్ని హింసిస్తారా?: చంద్రబాబు
- రామతీర్థం ఘటనలపై ప్రభుత్వంపై ధ్వజమెత్తిన చంద్రబాబు
- సూరిబాబును తప్పు ఒప్పుకోవాలని హింసిస్తున్నారని ఆరోపణ
- తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారని వెల్లడి
- టీడీపీ మీదకు నేరం నెట్టాలని చూడొద్దంటూ స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం ఘటనలో ప్రభుత్వం తీరును మరోసారి తప్పుబట్టారు. రామతీర్థం ఘటనలో అసలైన దోషులను పట్టుకోవడం మానేసి, అమాయకుడైన రామభక్తుడు సూరిబాబును తప్పు ఒప్పుకోవాలని హింసిస్తున్నారని ఆరోపించారు.
సూరిబాబుతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారని వెల్లడించారు. దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. అధికారులు కోరితే ప్రమాదకరమైన బావిలో దిగి సహకరించినందుకు అతనికి, అతని కుటుంబానికి మీరు ద్రోహం చేస్తారా? అని నిలదీశారు. "నేరాన్ని టీడీపీ మీదకు నెట్టాలనుకునే కుట్రలను సహించేది లేదు... జాగ్రత్త!" అంటూ చంద్రబాబు హెచ్చరించారు.
వైసీపీ వాహనంపై ఎవరో వాటర్ ప్యాకెట్లు విసిరేస్తే, టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. "పోలీసులూ... ప్రభుత్వం చెప్పిన దాన్ని గుడ్డిగా అనుసరిస్తూ దేవుడి విషయంలో పాపం మూటగట్టుకోవద్దు" అని చంద్రబాబు సూచించారు.