Kalva Srinivasulu: చంద్రబాబు వెళ్లేదాకా ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది? ఎక్కడ గడ్డి పీకుతోంది?: కాల్వ శ్రీనివాస్
- జగన్, హోం మంత్రి, డీజీపీ ముగ్గురూ క్రైస్తవులే
- ఒక అనాగరిక సమాజాన్ని సృష్టించేందుకు జగన్ యత్నిస్తున్నారు
- రామతీర్థం నుంచి విజయసాయిరెడ్డి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లిపోయారు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ముగ్గురూ క్రైస్తవులేనని ఆయన అన్నారు. కీలక స్థానాల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు క్రైస్తవులైనప్పుడు... హిందూ మతం పట్ల వైసీపీ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. దేవుడికి కూడా రక్షణ లేనటువంటి ఒక అనాగరిక సమాజాన్ని సృష్టించేందుకు జగన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక విధమైనటువంటి ఆందోళనకర వాతావరణం నెలకొందని చెప్పారు.
బ్రిటీష్ వారి సమయంలో కూడా ఆలయాలపై ఇన్ని దాడులు జరగలేదని కాల్వ శ్రీనివాసులు దుయ్యబట్టారు. ప్రభుత్వ విశృంఖలత్వం చివరకు రాముడి తలను తీసేసేంత వరకు తీసుకొచ్చిందని అన్నారు. తమ అధినేత చంద్రబాబు రామతీర్థంకు వెళ్లేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోందని, ఎక్కడ గడ్డి పీకుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా... చివరకు ఆయనను ప్రజలే అక్కడకు తీసుకెళ్లారని అన్నారు. చంద్రబాబు అక్కడకు వెళ్తున్న సమయంలో విజయసాయి అక్కడకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. రామతీర్థం నుంచి విజయసాయి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లారని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డిపై జరిగిన దాడితో చంద్రబాబుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు.
ఓ వైపు అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మిస్తుంటే... ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేశారని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. హిందూ ధర్మంపై ప్రభుత్వమే దాడులు చేస్తుంటే... ఇంకెవరితో చెప్పుకోవాలని అసహనం వ్యక్తం చేశారు. ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై సీబీఐ చేత విచారణ జరిపించాలని అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.