Julian Assange: ఈ పరిస్థితుల్లో అసాంజేను అప్పగించలేం: అమెరికాకు తేల్చి చెప్పిన బ్రిటన్ కోర్టు
- గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజే
- మానసికంగా కుంగిపోయాడన్న న్యాయస్థానం
- అతడిలో ఆత్మహత్య ఆలోచనలున్నాయని వెల్లడి
- అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని స్పష్టీకరణ
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఊరట కలిగింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను అమెరికాకు అప్పగించలేమని బ్రిటన్ కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం అసాంజే మానసిక ఆరోగ్యం క్షీణ దశలో ఉందని, తీవ్ర మానసిక కుంగుబాటు, బలవన్మరణం ఆలోచనలతో సతమతమవుతున్నాడని ఈ కేసు విచారణ చేపట్టిన జడ్జి వెనెస్సా బరైట్సర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అసాంజేను అప్పగిస్తే అతడు ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో అత్యంత కఠినంగా ఉండే భద్రత ఏర్పాట్ల మధ్య అతడి మానసిక స్థితి మరింత క్షీణించే అవకాశం ఉందని జడ్జి అభిప్రాయపడ్డారు.
కాగా, కోర్టు తీర్పు సందర్భంగా జూలియన్ అసాంజే నుదుటిని చేత్తో రుద్దుకుంటూ నిర్లిప్త ధోరణిలో కనిపించగా, అతడి కాబోయే భార్య స్టెల్లా మోరిస్ కన్నీటి పర్యంతమయ్యారు. దాంతో ఆమెను వికిలీక్స్ చీఫ్ ఎడిటర్ క్రిస్టీన్ ఓదార్చడం కోర్టు హాల్లో దర్శనమిచ్చింది.