Bharat Biotech: భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను భారీఎత్తున కొనుగోలు చేయనున్న బ్రెజిల్ ప్రైవేట్ క్లినిక్స్!
- ప్రైవేట్ మార్కెట్లో విక్రయించాలని నిర్ణయం
- వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందన్న ఏబీసీవీఏసీ
- బ్రెజిల్ రెగ్యులేటర్ అనుమతి రాగానే అమ్మకాలు
బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ వ్యాక్సిన్ క్లినిక్స్ (ఏబీసీవీఏసీ) భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ ను భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ విషయాన్ని క్లినిక్స్ సంఘం తమ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. ప్రస్తుతం భారత్ బయోటెక్ మూడవ దశ క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తోందని, ఈ పరీక్షలు ముగియగానే వ్యాక్సిన్ వస్తుందని ప్రకటించింది. అయితే, బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ తుది అనుమతులు ఇచ్చిన తరువాతే వ్యాక్సిన్ ను వినియోగిస్తామని స్పష్టం చేసింది.
కాగా, ఇప్పటికే బ్రెజిల్ ప్రభుత్వంపై వ్యాక్సిన్ కోసం తీవ్రమైన ఒత్తిడి ఉందన్న సంగతి తెలిసిందే. మరణాల విషయంలో యూఎస్ తరువాత అత్యధిక రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను దేశ ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ లో వినియోగించాలని ఏబీసీవీఏసీ భావిస్తోంది. ఈ వ్యాక్సిన్ ధర కూడా చౌకగానే ఉంటుందని, దీంతో అత్యధికులు కొనుగోలు చేసే వీలుంటుందని క్లినిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గెరాల్డో బార్బోసా అభిప్రాయపడ్డారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తోందని 'గోల్బో న్యూస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం తరఫున ఆర్డర్ ఇచ్చే వ్యాక్సిన్ డోస్ లకు ఇది అదనమని పేర్కొన్న బార్బోసా, ఇప్పటికే భారత ప్రభుత్వం కొవాగ్జిన్ కు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.