Supreme Court: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులకు సుప్రీంకోర్టు అనుమతి
- ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు పిటిషన్లు
- కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనలతో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం
- 2-1 మెజార్టీతో తీర్పు
- ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని వ్యాఖ్య
ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 20,000 కోట్లతో తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పార్లమెంట్ నూతన భవనంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సచివాలయం వంటివి నిర్మించనున్నారు.
అయితే, కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనలతో త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించి 2-1 మెజార్టీతో తీర్పు చెప్పింది. జస్టిస్ ఖాన్విల్కర్ తో పాటు జస్టిస్ దినేశ్ మహేశ్వరి ఏకాభిప్రాయంతో తీర్పును రాశారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా మాత్రం విడిగా తీర్పు కాపీని రాశారు. ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్లపై కేంద్ర ప్రభుత్వ వాదనలు ఆమోదయోగ్యంగానే ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని పేర్కొంది. ఇప్పటికే పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టు కోసం ఇచ్చిన అనుమతులు, ఇందుకు జరిగిన భూమి కేటాయింపులు సరిగ్గానే ఉన్నాయని చెప్పింది.
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే, యాంటీ-స్మాగ్ గన్నులను ఉపయోగించాలని చెప్పింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణాలకు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి అవసరమని, అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది. సెంట్రల్ విస్టా కోసం గుజరాత్‌కు చెందిన సంస్థ హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఒక త్రిభుజాకారపు పార్లమెంట్ భవనంతో పాటు ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరిస్తారు. పార్లమెంట్ భవనంలో ఒక పెద్ద హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్ తో పాటు ఓ లైబ్రరీ, కమిటీ గదులు, డైనింగ్ హాళ్లు, పార్కింగ్ ప్రదేశాలు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ప్రధానమంత్రి నూతన నివాసం, ఆఫీసులను సౌత్ బ్లాక్‌కు, ఉపరాష్ట్రపతి నివాసాన్ని నార్త్ బ్లాక్ సమీపంలోకి తరలిస్తారు.
2022, ఆగస్టు 15 నాటికి పార్లమెంట్ భవన నిర్మాణ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. అలాగే, కేంద్ర సచివాలయాన్ని 2024 నాటికి పూర్తి చేస్తారు. గత ఏడాది డిసెంబరు 10న పార్లమెంట్ భవన నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.