Avanthi Srinivas: బీజేపీ, జనసేన చంద్రబాబు ట్రాప్ లో పడకూడదు: మంత్రి అవంతి
- రామతీర్థం ఘటన దురదృష్టకరం
- అందరికీ ఉన్న భక్తి మాకు కూడా ఉంది
- వైసీపీపై చంద్రబాబు క్రిస్టియన్ ముద్ర వేస్తున్నారు
ఏపీలో హిందూ ఆలయాలు, విగ్రహాల ధ్వంసంపై కలకలం రేగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో.. సరికొత్త చర్చ తీవ్ర రూపం దాలుస్తోంది. ముఖ్యమంత్రి, డీజీపీ ఇద్దరూ క్రిస్టియన్లు కావడం వల్లే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నేత, రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. రామతీర్థంలో జరిగిన ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని చెప్పారు. చంద్రబాబు మతాల గురించి మాట్లాడటం బాధాకరమని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నో ఆలయాలపై దాడులు జరిగినా స్పందించని చంద్రబాబు... రామతీర్థం ఘటన జరిగిన వెంటనే స్పందించడం, అక్కడకు వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని అవంతి అన్నారు. తిరుమలకు ఎన్నోసార్లు వెళ్లిన చంద్రబాబు వెంకన్నకు తలనీలాలు ఎప్పుడు సమర్పించారని ప్రశ్నించారు.
బీజేపీ, జనసేన నేతలకు దేవుళ్లపై ఎంత భక్తి ఉందో.. తమకు కూడా అంతే భక్తి ఉందని అన్నారు. బీజేపీ నేతలు విభజన హామీలపై పని చేయాలని అన్నారు. చంద్రబాబు ట్రాప్ లో బీజేపీ, జనసేన పడకూడదని హితవు పలికారు. వైసీపీపై క్రిస్టియన్ ముద్ర వేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. తమ పార్టీలో 90 శాతానికి పైగా హిందువులు ఉన్నారని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే పనిని చంద్రబాబు మానుకోవాలని సూచించారు.