Justice Rakesh Kumar: జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం
- మిషన్ బిల్డ్ ఏపీ కేసు తీర్పులో జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేశ్ కుమార్
- గూగుల్ లో ఖైదీ నంబర్ 6093 అని కొడితే చాలా సమాచారం వస్తుందని వ్యాఖ్య
- సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన చీఫ్ సెక్రటరీ
'మిషన్ బిల్డ్ ఏపీ' కేసులో హైకోర్టు జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ ఇచ్చిన తీర్పు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ తీర్పులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జస్టిస్ రాకేశ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 11 సీబీఐ, ఆరు ఈడీ, మరో 18 కేసుల్లో జగన్ నిందితుడని ఆయన పేర్కొన్నారు. జడ్జిలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి జగన్ లేఖ రాసిన తర్వాత రాష్ట్ర అధికారుల్లో ధైర్యం పెరిగిందని అన్నారు. రూల్ ఆఫ్ లాను డీజీపీ వదిలేశారని... ప్రభుత్వం ఆదేశించినట్టు పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఖైదీ నంబర్ 6093 అని కొడితే గూగుల్ లో జగన్ గురించి చాలా సమాచారం వస్తుందని అన్నారు. ఇదే సమయంలో బిల్డ్ ఏపీ అధికారి ప్రవీణ్ కుమార్ (ఐఏఎస్) తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం పట్ల క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు ఆదేశించారు. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తీర్పుపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ చీఫ్ సెక్రటరీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.