Jana Reddy: పీసీసీ చీఫ్‌ని అప్పుడే ప్రకటించొద్దు: అధిష్ఠానాన్ని కోరిన జానారెడ్డి
- నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు నియామకం వద్దు
- ఐక్యత లోపిస్తే ఆ ప్రభావం ఎన్నికపై పడుతుంది
- హైకమాండ్ పెద్దలకు జానారెడ్డి ఫోన్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్న వేళ ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కీలక సూచన చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు అధ్యక్షుడి నియామకాన్ని వాయిదా వేయాలని అధిష్ఠానాన్ని కోరారు. లేదంటే ఆ ప్రభావం ఉప ఎన్నికపై పడుతుందని అన్నారు.
ఉప ఎన్నికకు ముందు అధ్యక్షుడిని ప్రకటిస్తే నాయకుల్లో ఐక్యత లోపిస్తుందని, అంతిమంగా అది ఉప ఎన్నికపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ కార్యదర్శి ఎస్ఎస్ బోస్‌రాజుకు, హైకమాండ్ పెద్దలకు ఫోన్ చేసిన జానారెడ్డి ఈ విషయంలో ఆలోచించాలని కోరారు.
మరోవైపు, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు నిన్నమొన్నటి వరకు వార్తలు రాగా తాజాగా, సీనియర్ నేత జీవన్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. వివాద రహితుడైన జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, రేవంత్‌రెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించబోతున్నట్టు తెలుస్తోంది.