Avanthi Srinivas: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను అడ్డుకున్న నర్సులు
- పాడేరు పర్యటనలో అవంతికి నిరసన సెగ
- మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని తాత్కాలిక నర్సుల నిరసన
- సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చిన మంత్రి
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్ ని నర్సులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే అవంతి ఈరోజు విశాఖ ఏజెన్సీలోని పాడేరు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కోవిడ్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులు ఆయనను అడ్డుకున్నారు. వీరంతా తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్నారు. తమకు మూడు నెలల నుంచి వేతన బకాయిలు చెల్లించడం లేదంటూ... వారు మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు.
దీంతో, మంత్రి తన వాహనం నుంచి కిందకు దిగి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు, నిరసన చేపట్టిన తమ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని మంత్రికి నర్సులు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులపై అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.