AIADMK: సంక్రాంతి రోజున చెన్నైకి అమిత్ షా... రజనీకాంత్ ను కలిసి మద్దతు కోరనున్న బీజేపీ!
- సీఎంగా పళనిస్వామిని అంగీకరించని బీజేపీ
- సీట్ల సర్దుబాటు విషయంలోనూ విభేదాలు
- అమిత్ పర్యటనతో సమస్యలు తొలగుతాయని అంచనా
ఈ సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీ పెడతానని చెప్పిన రజనీకాంత్, తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో ఆయన మద్దతును పొందేందుకు మిగతా రాజకీయ పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా 14వ తేదీన చెన్నైకి రానున్నారు. ఆపై రజనీకాంత్ ను ప్రత్యేకంగా కలిసి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతివ్వాలని ఆయన కోరుతారని తెలుస్తోంది.
ఇదిలావుండగా, తదుపరి సీఎంగా ఎడపాడి పళనిస్వామిని ఎంత మాత్రమూ అంగీకరించబోమని, అన్నాడీఎంకేతో కలిసి వున్న బీజేపీ రాష్ట్ర నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆయనే తదుపరి ముఖ్యమంత్రని ఇప్పటికే అన్నాడీఎంకే స్పష్టం చేయగా, రెండు పార్టీల నేతల మధ్యా వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇక, బీజేపీ నేతలు తమకు 60 స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేస్తుండగా, దానికి అన్నాడీఎంకే అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. 34 సీట్లు మాత్రమే ఇస్తామని ఆఫర్ చేస్తోంది.
అమిత్ షా చెన్నై పర్యటనలో సీట్ల సర్దుబాటుతో పాటు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపైనా ఓ స్పష్టత వస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా అన్నాడీఎంకేతో బీజేపీ జరిపే తదుపరి చర్చలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.