USA: తెరచుకున్న కాపిటల్ బిల్డింగ్ సొరంగం... పరుగులు పెట్టిన అమెరికా ప్రజా ప్రతినిధులు!
- క్యాపిటల్ భవంతిలో సమావేశమైన ప్రతినిధులు
- అదే సమయంలో సెనెట్ లో ఉపాధ్యక్షుడు
- తలుపుల వరకూ వచ్చేసిన నిరసనకారులు
- సొరంగాన్ని తెరిచి సభ్యులను పంపిన సెక్యూరిటీ
- ప్రస్తుతం కాపిటల్ బిల్డింగ్ సురక్షితమని ప్రకటన
తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ను ఎంచుకునేలా ఎలక్టోరల్ కాలేజ్ ప్రత్యేకంగా సమావేశమైన వేళ, వాషింగ్టన్ డీసీలోని కాపిటల్ భవనం వద్ద జరిగిన విధ్వంసం, పోలీసుల కాల్పుల ఘటన లోపల ఉన్న ప్రజా ప్రతినిధులను తీవ్ర భయాందోళనలోకి నెట్టివేసింది.
ఆ సమయంలో కాపిటల్ బిల్డింగ్ లో నుంచి సురక్షిత మార్గానికి వెళ్లే వీలును కల్పించే అండర్ గ్రౌండ్ టన్నెల్ ను అధికారులు తెరిచారు. ట్రంప్ మద్దతుదారులు బారికేడ్లను దాటి ముందుకు వచ్చేశారన్న వార్త లోపలికి రాగానే, పలువురు ఆ రహస్య మార్గం ద్వారా సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు.
అంతకుముందు, ప్రతినిధుల సభ సమావేశం ముందుగా అనుకున్నట్టుగానే ప్రారంభమైంది. సభ ప్రారంభమైన కాసేపటికి ట్రంప్ మద్దతుదారులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ, భవంతి ముందుకు వచ్చారు. వారు రక్షణ గోడను దాటి ముందుకు రావడంతో "అందరూ ఓ వరుసలో ఉండండి. ఈ భవనాన్ని పూర్తి సెక్యూర్ చేయాలి" అని హౌస్ సార్జెంట్ పాల్ ఇర్వింగ్ కేకలు పెట్టారు. ఆ సమయంలో ప్రతినిధుల సభలో ఓ రిపబ్లికన్ సభ్యుడు జో బైడెన్ కు వచ్చిన ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను తాము పరిగణనలోకి తీసుకోబోమంటూ ప్రసంగిస్తున్నారు.
ఆపై నిమిషాల వ్యవధిలోనే సెనేట్ చాంబర్ ను వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ వీడినట్టుగా సమాచారం అందింది. ప్రతినిధుల సభను, సెనెట్ ను కలిపివుంచే సెంట్రల్ డోమ్ వరకూ నిరసనకారులు చేరారని, వారు మెట్లు ఎక్కుతున్నారని, అడ్డుకునేందుకు పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం కూడా అందింది. ఆ వెంటనే సభలో ఉన్న వారంతా ప్రశాంతంగా ఉండాలన్న సూచన అందింది. ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు ఖాళీ చేయాలని చెబుతూ జాగ్రత్తలు అందాయి.
ఆ సమయంలో హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, ఫ్లోర్ డైరెక్టర్ కీత్ స్టెర్న్ ప్రతి ఒక్కరూ కూర్చునే ఉండాలని, ఏమీ కాదని సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. హౌస్ రూల్స్ కమిటీ చైర్మన్ జిమ్ మెక్ గొవెర్న్ కూడా, ప్రతి ఒక్కరూ సురక్షితమేనన్న భరోసాను కల్పించేందుకు ప్రయత్నించారు. ఆపై నిమిషాల వ్యవధిలోనే ప్రతి ఒక్కరూ గ్యాస్ మాస్క్ లు ధరించాలన్న సూచన అందగానే, సభ్యుల్లో ఆందోళన రెట్టింపైంది.
సభలో ఉన్న డెమోక్రాట్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తెన్నెస్సీకి చెందిన డెమొక్రాట్ సభ్యుడు స్టీవ్ కోహెన్, "మీ స్నేహితుడు ఎక్కడ? ట్రంప్ ను పిలవండి" అంటూ రిపబ్లికన్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనకారులు చాంబర్ వద్దకు చేరుకున్నారన్న వార్త రావడంతోనే, పోలీసులు అన్ని ద్వారాలనూ మూసివేశారు. కాపిటల్ పోలీసులు తమ గన్స్ ను అన్ని డోర్లవైపూ ఎక్కుపెట్టారు.
ఆ సమయంలో "ఇదంతా మీ వల్లే జరిగింది" అని రిపబ్లికన్ల వైపు వేలును చూపిస్తూ, మిన్నెసోటా డెమొక్రాట్ సభ్యుడు డీన్ ఫిలిప్స్ నిప్పులు చెరిగారు. ఆపై ప్రతినిధుల సభ నుంచి పైకి వెళ్లేందుకు మెట్లను తెరిచారు. అక్కడి నుంచి భూగర్భంలో నిర్మించిన సొరంగ మార్గాన్ని కూడా తెరిచారు. సభ్యులంతా దాని ద్వారా వెళ్లాలన్న సూచనలు అందడంతోనే, సభ్యులంతా సురక్షిత ప్రాంతానికి వెళ్లారు.
ఆపై అక్కడికి చేరుకున్న అదనపు బలగాలు ట్రంప్ మద్దతుదారులను దూరంగా తరిమివేశాయి. పోలీసుల కాల్పుల తరువాత ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని క్యాపిటల్ బిల్డింగ్ ను సురక్షితం చేశామని అధికారులు ప్రకటించారు.