Sonu Sood: సోనూసూద్ పై పోలీసుల‌కు బీఎంసీ లి‌ఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు

BMC has filed a police complaint against actor Sonu Sood

  • మ‌హారాష్ట్ర‌లోని జుహూ ప్రాంతంలో సోనుకి 6 అంత‌స్తుల భ‌వనం
  • అనుమ‌తులు లేకుండా హోట‌ల్ గా మార్చిన వైనం
  • ఇప్ప‌టికే నోటీసులు పంపాం.. స్పందించ‌లేదు
  • వివ‌రాలు తెలిపిన బీఎంసీ

మ‌హారాష్ట్ర‌లోని జుహూ ప్రాంతంలో త‌న ఆరు అంత‌స్తుల నివాస‌ భ‌వ‌నాన్ని అనుమ‌తులు లేకుండా హోట‌ల్ గా మార్చారంటూ సినీ న‌టుడు సోనూ సూద్ పై బృహాన్ ముంబై మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) పోలీసుల‌కు లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేసింది. వెంట‌నే ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలని కోరింది.

హోట‌ల్ కు అనుమ‌తులు లేని విష‌యంపై ఇప్ప‌టికే బీఎంసీ సోనూ సూద్ కి నోటీసులు పంపినప్ప‌టికీ ఆయ‌న స్పందించ‌క‌పోవ‌డంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఆ భ‌వ‌న నిర్మాణంలో మార్పులు చేస్తూ కూడా చ‌ట్ట‌విరుద్ధంగా నిర్మాణాలు చేప‌ట్టార‌ని తెలిపింది. సోనూ సూద్ భార్య సొనాలీ సూద్ పై కూడా ఈ విష‌యంపై ఫిర్యాదు చేసింది.

తాము ఇప్ప‌టికే రెండు సార్లు ఆ భ‌వ‌నాన్ని ప‌రిశీలించి సోనూసూద్ కి చెప్పిన‌ప్ప‌టికీ ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ని తెలిపింది. సోనూసూద్ కి మొద‌ట 2020, అక్టోబ‌రు 7న నోటీసులు పంపి 2020 న‌వంబ‌రు 26లోపు స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించామ‌ని బీఎంసీ అంటోంది. ఆయ‌న స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో ఆయ‌న‌కు మ‌రింత స‌మ‌యం ఇచ్చామ‌ని చెప్పింది. అనంత‌రం ఈ నెల 4న మ‌రోసారి ఆ భ‌వనాన్ని ప‌రిశీలించామ‌ని తెలిపింది.

ఆ భ‌వ‌నంలో చ‌ట్ట విరుద్ధంగా మ‌రో నిర్మాణం చేప‌ట్టార‌ని గుర్తించామ‌ని వివ‌రించింది. ఇప్ప‌టికీ ఆయ‌న వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోడంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు చెబుతోంది. ప్ర‌స్తుతం సోనూసూద్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నాడు. పేద‌ల‌కు ఆయ‌న వ‌రుస‌గా సాయం చేస్తుండ‌డంతో దేశ వ్యాప్తంగా మంచి పేరు వ‌చ్చింది.  

  • Loading...

More Telugu News