KTR: ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్
- గతంలో ఐటీఐఆర్ ప్రతిపాదనలు చేసిన కేంద్రం
- హైదరాబాదును కూడా ఎంపిక చేసిందన్న కేటీఆర్
- ఇంతవరకు ప్రాజెక్టు ప్రారంభం కాలేదని వెల్లడి
- ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలని వినతి
- కేంద్ర ఐటీ మంత్రికి లేఖ
గతంలో కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) పేరిట ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు.
ఐటీఐఆర్ కోసం 2010లో హైదరాబాదు, బెంగళూరు నగరాలను కేంద్రం ఎంపిక చేసిందని, దీనికోసం 49 వేల ఎకరాలతో పాటు హైదరాబాదులో మూడు క్లస్టర్ లను కూడా గుర్తించారని కేటీఆర్ తన లేఖలో వెల్లడించారు. అనేక నూతన కంపెనీలను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్రం అంగీకరించిందని వివరించారు.
రూ.3,275 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిందని, 20 ఏళ్లలో వివిధ దశల్లో ఐటీఐఆర్ ప్రాజెక్టు కార్యాచరణ రూపొందించారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ఐటీఐఆర్ మొదటి దశలో నిర్వర్తించాల్సిన పలు అంశాలకు సంబంధించిన నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉందని, కేంద్రం నుంచి తగిన స్పందన రాలేదని ఆరోపించారు. దాంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాదులో ఏమాత్రం పురోగతి లేదని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ కూడా దీనిపై ఎన్నో లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. 2014 నుంచి ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రానికి స్పష్టమైన విధానం కొరవడిందని, కనీసం ఇప్పుడైనా ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని, లేకపోతే, అంతకంటే మెరుగైన మరో కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా నెలకొన్న సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ఐటీ పరిశ్రమ సాఫీగా తమ కార్యకలాపాలు కొనసాగించిందని కేటీఆర్ వెల్లడించారు.
ప్రపంచ ఆర్థిక మందగమనం, కొవిడ్ సంక్షోభం వంటి కారణాలతో కంపెనీలు పునరుజ్జీవం పొందడానికి కొంత సమయం పడుతుందని, ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో ఐటీ పరిశ్రమకు ఊతమిచ్చే మెరుగైన కార్యక్రమాన్ని అందిస్తే బాగుంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఐటీఐఆర్ కానీ, దాన్ని మించిన కార్యక్రమం కానీ తెస్తే తెలంగాణలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని వెల్లడించారు.