Badaun: ఆమె సాయంత్రం బయటకు రాకుండా ఉండాల్సింది: బదాయు ఘటనపై మహిళా కమిషన్ సభ్యురాలి వివాదాస్పద వ్యాఖ్యలు
- కుటుంబ సభ్యుల్ని వెంట తీసుకెళ్లి వుంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న చంద్రముఖి
- పిలిపించి మాట్లాడతానన్న చైర్ పర్సన్ రేఖాశర్మ
- మహిళకు ఎప్పుడైనా, ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందన్న చైర్ పర్సన్
ఉత్తరప్రదేశ్లోని బదాయు ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హత్యాచార బాధిత మహిళ సాయంత్రం పూట బయటకు రాకుండా ఉండి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ.. ఆమెను పిలిపించి మాట్లాడనున్నట్టు తెలిపారు. మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉందని, వారు ఎప్పుడైనా, ఎక్కడైనా తిరగొచ్చని స్పష్టం చేశారు.
మహిళా కమిషన్ సభ్యురాలైన చంద్రముఖి బుధవారం బదాయు వెళ్లి బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎవరి నుంచైనా ఒత్తిడి ఉందని భావించినప్పుడు బయట తిరిగే సమయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. సాయంత్రం ఆమె బయటకు వెళ్లకపోయినా, లేదంటే తోడుగా ఎవరైనా కుటుంబ సభ్యులని వెంట తీసుకెళ్లినా ఈ ఘటన జరిగి ఉండేది కాదని, ఆమె క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేదని వ్యాఖ్యానించారు.
ఆమె వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇవేం వ్యాఖ్యలంటూ దుమ్మెత్తి పోశారు. విమర్శలపై స్పందించిన కమిషన్ చైర్మన్ రేఖాశర్మ.. చంద్రముఖిని పిలిపించి వివరణ కోరుతామని పేర్కొన్నారు. మహిళకు సర్వాధికారాలు ఉన్నాయని, స్వేచ్ఛగా బయట తిరిగే హక్కు ఆమెకు ఉందని అన్నారు.