Warangal Urban District: వరంగల్ అర్బన్ జిల్లాలో 120 నాటు కోళ్లు మృతి
- భీమదేవరపల్లి మండలం కొప్పూరులో ఘటన
- పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోన్న నేపథ్యంలో కలకలం
- నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలింపు
భారత్ లోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరులో 120 నాటు కోళ్లు మృతి చెందడం కలకలం రేపింది. ఆ ప్రాంతానికి చెందిన గద్ద సారయ్య అనే వ్యక్తి నాటు కోళ్ల పెంపకం, అమ్మకం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.
ఉన్నట్టుండి రెండు రోజుల వ్యవధిలోనే 120 కోళ్లు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయాడు. ఆయనకు దాదాపు లక్ష రూపాయల నష్టం వచ్చింది. కోళ్లు మృతి చెందాయన్న విషయాన్ని తెలుసుకున్న మండల పశువైద్యాధికారి మాలతి వాటిని పరిశీలించారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను పరీక్షల నిమిత్తం మొదట వరంగల్ ప్రాంతీయ పశు వైద్యశాలకు పంపారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. బర్డ్ ఫ్లూ విజృంభిస్తోన్న నేపథ్యంలో వరంగల్ లోనూ కోళ్లు మృత్యువాత పడడం గమనార్హం.