Vijay Sai Reddy: టీడీపీని 'టెంపుల్స్ డిమాలిషన్ పార్టీ'గా దిగజార్చాడు: విజయసాయిరెడ్డి
- అధికారంలో ఉన్నప్పుడు గుడులు అభివృద్ధికి అడ్డంగా ఉన్నాయన్నారు
- విజయవాడలో 39 గుళ్లను నేలమట్టం చేశాడు
- ఇప్పుడు అధికారం కోసం ప్రయత్నాలు
- ఆలయాలను కూల్చి అరాచకం సృష్టించాలని కుట్రలు
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై వరసగా దాడులు జరుగుతోన్న నేపథ్యంలో కలకలం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
'అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డంగా ఉన్నాయని విజయవాడలో 39 గుళ్లను నేలమట్టం చేశాడు. ఇప్పుడు అధికారం కోసం ఆలయాలను కూల్చి అరాచకం సృష్టించాలని కుట్రలు చేస్తున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన పార్టీని టెంపుల్స్ డిమాలిషన్ పార్టీ (టీడీపీ)గా దిగజార్చాడు. పతనం ఇంతటితో ఆగదు' అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.
కాగా, సీఎం జగన్ పాలనలో ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. 'అన్ని ప్రాంతాల అభివృద్ధిపై సీఎం జగన్ గారి ప్రత్యేక శ్రద్ధ. భీమిలి నుంచి భోగాపురం వరకూ తీరంలో ఆరు లైన్ల బీచ్ రోడ్డు. గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జి నిర్మాణం. మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు... వెయ్యికోట్లతో డీపీఆర్ ఆమోదించేందుకు చర్యలు' అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.