Nara Lokesh: విగ్రహాల ధ్వంసంపై వార్తలు రాసినందుకు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: లోకేశ్ విమర్శలు
- నిందితులను గాలికొదిలేశారు
- సమాచారం ఇచ్చిన వ్యక్తులను వేధిస్తున్నారు
- అమాయకులపై కేసులు పెడుతున్నారు
- ముందే విగ్రహాలు విరిగిపోయాయని మాయచేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో దేవుళ్ల విగ్రహాల ధ్వంసం కేసుల్లో వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'నిందితులను గాలికొదిలేసి సమాచారం ఇచ్చిన వ్యక్తులను, వార్త రాసిన జర్నలిస్టులను వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత. ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ముఖ ద్వారంపై ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసమైన వార్త రాసినందుకు జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం వైఎస్ జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట' అని లోకేశ్ విమర్శించారు.
'రాష్ట్రంలో 140 ఘటనలు జరిగితే నిందితులను పట్టుకోలేని ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి సమాచారం బయటపెట్టిన వ్యక్తులు, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తుంది' అని లోకేశ్ ఆరోపించారు.
'వైకాపా నాయకుల ఒత్తిళ్లకు లొంగి అమాయకులపై కేసులు పెడుతున్న కొంతమంది పోలీసులు పర్యవసానం అనుభవించక తప్పదు. ముందే విగ్రహాలు విరిగిపోయాయని మాయచేస్తున్న ప్రభుత్వం మరమ్మత్తులు ఎందుకు చెయ్యలేదు? వాస్తవాలు బయటకొచ్చాకా ఏదో తప్పుడు కథలు చెప్పడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది' అంటూ విమర్శించారు.