Study: తీవ్ర ఒత్తిడిలో భారత జవాను... తాజా అధ్యయనంలో వెల్లడి: కొట్టిపారేసిన సైన్యం!
- భారత సైన్యంలో 13 లక్షల మంది జవాన్లు
- 50 శాతం మంది ఒత్తిడిలో ఉన్నట్టు అధ్యయనం వెల్లడి
- ఒత్తిడిలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడి
- చిన్న సర్వే నిర్వహించారని వ్యాఖ్యలు
అయినవాళ్లకు దూరంగా ఉంటూ అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో దేశ రక్షణ విధులు నిర్వర్తించడం మామూలు విషయం కాదు. అది సైనికులకు మాత్రమే సాధ్యం. ఏ దేశం అయినా తన సైన్యాన్ని చూసుకుని ఎంతో నిబ్బరంగా ఉంటుంది. భారత్ కూడా అంతే. ఇరువైపులా పొంచి ఉన్న చైనా, పాకిస్థాన్ ల నుంచి దేశాన్ని కాపాడుతోంది సైన్యమే. అయితే, మన సైనికుల్లో 50 శాతం పైగా జవాన్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. 13 లక్షల మంది ఉన్న భారత ఆర్మీలో సగం మంది వివిధ కారణాలతో మానసికంగా కుంగిపోతున్నారని యునైటైడ్ సర్వీసెస్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఒత్తిడికి చిత్తవుతున్న జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడడం, అయినవారిని హత్యచేయడం, అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతూ సైన్యానికి దూరమవుతున్నారని, ఇలాంటి వారి సంఖ్య ప్రతి ఏటా గణనీయస్థాయిలో నమోదవుతోందని ఆ సంస్థ వివరించింది. గత రెండు దశాబ్దాలుగా ఆర్మీ సిబ్బందిలో ఒత్తిడి పాళ్లు పెరుగుతూ వస్తున్నాయని, ముఖ్యంగా, సుదీర్ఘకాలంగా జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాలు, కౌంటర్ ఆపరేషన్లలో పాల్గొనే సైనికులు మానసికంగా, శారీరకంగా దెబ్బతింటున్నారని ఆ అధ్యయనం వివరించింది.
సరిహద్దులోని సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే జవాన్లు, అటు విధి నిర్వహణ ఒత్తిళ్లు, ఇటు తమ స్వస్థలాల్లో కుటుంబ పరమైన సమస్యలు పరిష్కరించుకోలేక సతమతమవుతున్నారని, ఈ పరిస్థితి వారిని తీవ్ర నిర్ణయాల దిశగా పురిగొల్పుతోందని పేర్కొంది. అయితే ఈ అధ్యయాన్ని భారత సైన్యం తోసిపుచ్చింది.
కేవలం కొంతమందిపై సర్వే చేసి ఇంతటి కీలకమైన అంశాలను నిర్ధారించడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది. ఎంతో తీవ్రమైన కారణాలను వెలికితీయడానికి ఇంత చిన్న సర్వే ఏం సరిపోతుందని పేర్కొంది. సైన్యానికి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ, 400 మంది సైనికులను విచారించి అధ్యయనం అయిందనిపించారని, అధ్యయనకర్తలు ఇందులో ఎలాంటి విధానాలు ఉపయోగించారో తెలియడం లేదు కానీ, వారు వెల్లడించిన అంశాలు తర్కానికి నిలబడవు అని స్పష్టం చేశారు.