Asaduddin Owaisi: అసదుద్దీన్‌కు షాక్.. టీఎంసీలో చేరిన బెంగాల్ ఎంఐఎం అధ్యక్షుడు
- అనుచరులతో కలిసి మమత పార్టీలో చేరిన ఎస్‌కే అబ్దుల్ కలాం
- అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని అసద్ యోచన
- అసద్‌కు ఎదురుదెబ్బేనంటున్న రాజకీయ విశ్లేషకులు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి షాక్ తగిలింది. ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ తాత్కాలిక అధ్యక్షుడు ఎస్‌కే అబ్దుల్ కలాం తన మద్దతుదారులతో కలిసి నిన్న అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించేందుకు యత్నిస్తున్న అసద్‌కు ఇది ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.
గతేడాది బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేసిన అసద్ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాల్లో బరిలోకి దిగాలని అసద్ నిర్ణయించారు. నిజానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి పోటీ చేయాలని అసద్ ప్రతిపాదించినప్పటికీ అందుకు మమత ససేమిరా అన్నట్టు తెలిసింది. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బెంగాల్ చీఫ్ టీఎంసీలో చేరడం ఎంఐఎంకు షాకేనని చెబుతున్నారు.