Mohammed Siraj: సిడ్నీలో సిరాజ్ పై జాత్యహంకార వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భారత మాజీ క్రికెటర్లు
- సిడ్నీ మైదానంలో వివక్ష కలకలం
- సిరాజ్ ను లక్ష్యంగా చేసుకున్న ఆసీస్ ప్రేక్షకులు
- నిన్న జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన వైనం
- ఇవాళ కూడా అదే తీరు
- ఆసీస్ లో ఇదేమీ కొత్త కాదన్న హర్భజన్
- వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏంటన్న లక్ష్మణ్
ఆస్ట్రేలియాలో పర్యటించే ఉపఖండం జట్లకు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురుకావడం కొత్తకాదు. అయితే, టీమిండియాలో కొత్తగా అడుగుపెట్టి తన సత్తా చాటుతున్న యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పట్ల సిడ్నీ టెస్టులో కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న మూడో రోజు ఆటలో కొందరు సిరాజ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఇవాళ్టి ఆటలోనూ కొందరు ప్రేక్షకులు జాతి దురహంకారంతో సిరాజ్ ను టార్గెట్ చేశారు. దీనిపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ, గతంలో తనను మతం, రంగు సహా అనేక అంశాలపై వివక్ష పూరిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారని వెల్లడించారు. ఆస్ట్రేలియాలో ప్రేక్షకులు ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదని హర్భజన్ వెల్లడించాడు. దీన్ని ఎలా ఆపుతారు? అంటూ ప్రశ్నించాడు.
ఎంతో సుహృద్భావ పూరిత వాతావరణంలో సాగుతున్న టెస్టు సిరీస్ ను ఇలాంటి వ్యాఖ్యలతో నాశనం చేస్తున్నారంటూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. సిడ్నీ క్రికెట్ మైదానంలో కొందరు ప్రేక్షకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నాడు.
ఇలాంటి చెత్తకు క్రికెట్లో చోటు లేదని హైదరాబాదీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లను ఎందుకు దూషిస్తారో తనకు ఇప్పటికీ అర్థం కాదని లక్ష్మణ్ పేర్కొన్నాడు. జాత్యహంకార వ్యాఖ్యలు చేసే వ్యక్తులు మైదానానికి రాకపోవడమే మంచిదని హితవు పలికాడు.