Laptop: వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి నగదు వద్దనుకుంటే ల్యాప్ టాప్ ఇస్తాం: సీఎం జగన్ ప్రకటన
- ఇవాళ అమ్మఒడి రెండో విడత నిధుల విడుదల
- నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
- ల్యాప్ టాప్ ల కోసం రివర్స్ టెండరింగ్ పిలుస్తామని వెల్లడి
- అత్యాధునిక ఫీచర్లున్న ల్యాప్ టాప్ లు ఇస్తామని వివరణ
నెల్లూరులో ఇవాళ అమ్మఒడి రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ తల్లుల ఖాతాలోకి నగదు జమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి పథకంలో నగదు వద్దనుకుంటే వారికి ల్యాప్ టాప్ అందిస్తామని వెల్లడించారు. ఈ ప్రత్యామ్నాయం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ల్యాప్ టాప్ ఖరీదు రూ.27 వేలు కాగా, అనేక కంపెనీలు రూ.18,500కే ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
అయితే దీనికి రివర్స్ టెండరింగ్ పిలిస్తే మరింత ధర తగ్గే అవకాశం ఉందని సీఎం జగన్ వివరించారు. కాగా, ప్రభుత్వం అందించే ప్రతి ల్యాప్ టాప్ లో 4 గిగాబైట్ రామ్, విండోస్ ఓఎస్, ఇతర ఆధునిక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సమయంలో విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే పేదింటి పిల్లలు ఆ సౌకర్యానికి దూరమయ్యారని, అందుకే ల్యాప్ టాప్ లు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు.