AP High Court: ఏపీ ప్రభుత్వానికి ఊరట... స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసిన హైకోర్టు

AP High Court suspends local body elections schedule

  • ఇటీవల స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసీ
  • విచారణ చేపట్టిన హైకోర్టు
  • ఎస్ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని వెల్లడి
  • వ్యాక్సిన్ పంపిణీ, ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించలేరన్న కోర్టు

ఏపీలో ఎలాగైనా స్థానిక ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఏపీ సర్కారుకు ఊరట కలిగించేలా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఇటీవల ఎస్ఈసీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇవాళ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు స్థానిక ఎన్నికలు అడ్డొస్తాయని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేశామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా ఎస్ఈసీ నిర్ణయాలను న్యాయస్థానం తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ పై ఎస్ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, స్థానిక ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం కష్టమని కోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ రెండు గంటల పాటు వాదనలు వినిపించారు. కాగా, హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ఈ నెల 8న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News